‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీ రివ్యూ

నటీనటులు: ప్రదీప్‌ మాచిరాజు, దీపిక పిల్లి, సత్య, మురళీధర్‌గౌడ్‌, రోహిణి, వెన్నెల కిశోర్‌, గెటప్‌ శ్రీను, బ్రహ్మానందం, బ్రహ్మాజీ తదితరులు

సంగీతం: రథన్‌

సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్‌.బాల్‌రెడ్డి

ఎడిటింగ్‌: పీకే

మాటలు: సందీప్‌ బొల్లా

సమర్పణ: భ్రమరాంబ

నిర్మాతలు: మాంక్స్‌ అండ్‌ మంకీస్‌

బ్యానర్‌: మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ పిక్చర్స్‌

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నితిన్‌, భరత్‌

విడుదల తేదీ: 11.04.2025

సినిమా నిడివి: 147 నిమిషాలు

బుల్లితెరపై ఎన్నో షోల ద్వారా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్‌ మాచిరాజు హీరోగా చేసిన తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్‌ అయింది. దాదాపు 4 సంవత్సరాల తర్వాత మరో మంచి టైటిల్‌ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించిన మొదటి సినిమా టైటిల్‌ని ఈ సినిమాకి పెట్టడంతో సినిమాపై కొంత క్యూరియాసిటీ క్రియేట్‌ అయిందని చెప్పాలి. మొదటి సినిమాతో సక్సెస్‌ఫుల్‌ హీరో అనిపించుకున్న ప్రదీప్‌కి ఈ సినిమా ఎంతవరకు ప్లస్‌ అయింది? ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు? ప్రేక్షకుల్ని ఎంతవరకు ఎంటర్‌టైన్‌ చేసింది? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

అది ఒక మారుమూల పల్లెటూరు. సాధారణంగా కొన్ని గ్రామాల్లో ఉండే ఆచారాలు, కట్టుబాట్లు అక్కడ కూడా ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల ఆ ఊరిలో చాలా సంవత్సరాలపాటు ఆడపిల్ల జన్మించదు. వరసగా 60 మంది అబ్బాయిలు పుడతారు. ఒకరోజు ఆ ఊరి దంపతులకు ఆడపిల్ల పుడుతుంది. దీంతో ఊరి జనం సంబరాలు చేసుకుంటారు. ఆ అమ్మాయికి రాజా అని పేరు పెడతారు. ఊరు బాగు కోసం ఎన్నో మంచి పనులు చేస్తూ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న రాజన్న.. ఆడపిల్ల పుట్టిన సందర్భంగా ఆ దంపతులకు ఒక షరతు విధిస్తాడు. వారి కూతుర్ని ఏనాడూ ఊరి బయటికి పంపించకూడదని, ఆ ఊళ్లోనే ఉన్న 60 మందిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని చెబుతాడు. అంతేకాదు, అలా పెళ్లి చేసుకున్న అబ్బాయికి తన ఆస్తి అంతా ఇచ్చేసి ఊరికి ప్రెసిడెంట్‌ని చేస్తానంటాడు. ఇక అప్పటి నుంచి రాజా(దీపిక పిల్లి)ను ఆ కుర్రాళ్ళంతా అపురూపంగా చూసుకుంటారు. ఎవరికి వారు ఆమెను ప్రేమించేందుకు ప్రయత్నిస్తారు. కట్‌ చేస్తే.. అతని పేరు కృష్ణ(ప్రదీప్‌ మాచిరాజు). హైదరాబాద్‌లోని ఒక కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తుంటాడు. రాజా ఉంటున్న ఊరిలో 60 బాత్‌రూమ్‌ల కాంట్రాక్ట్‌ రావడంతో అక్కడికి కృష్ణను పంపిస్తారు. కృష్ణతోపాటు అతని డ్రైవర్‌ బిలాల్‌(సత్య) కూడా వెళతాడు. బయటి ఊరి నుంచి ఏ మగాడ్నీ రానివ్వని ఆ ఊరి కుర్రాళ్ళు.. ఒక మంచి పని చేయడానికి వస్తున్న ఈ ఇద్దర్నీ ఆహ్వానిస్తారు. రాజాను వీరిద్దరూ చూడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఒకరోజు రాత్రి యాక్సిడెంటల్‌గా రాజా, కృష్ణ ఎదురుపడతారు. అనుకోకుండా ఇద్దరూ లిప్‌లాక్‌ చేసుకుంటారు. కొన్ని పరిణామాల తర్వాత రాజా, కృష్ణ ప్రేమించుకుంటున్నారని ఊరికి తెలిసిపోతుంది. రాజా ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది ఆమె ఇష్టం కాబట్టి కృష్ణను పెళ్లి చేసుకోవచ్చని, అయితే ఆ ఊరిలోని 60 మందికి కృష్ణ పెళ్లిళ్లు చేయాలని, అలా చేస్తేనే రాజాను పెళ్లి చేసుకోవాలని ప్రెసిడెంట్‌ ఆదేశిస్తాడు. దానికి ఒప్పుకున్న కృష్ణ.. రాజాతోపాటు ఆ 60 మందిని తీసుకొని సిటీకి బయల్దేరతాడు. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత వారితో కృష్ణ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి, వారందరికీ పెళ్లిళ్లు చేసి రాజాను సొంతం చేసుకోగలిగాడా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ:

ఈమధ్యకాలంలో యాక్షన్‌ సినిమాలతో, ఫ్యాక్షన్‌ సినిమాలతో, అనవసరమైన గందగోళాలతో కూడిన సినిమాలు చూస్తూ విసుగెత్తిపోయిన ప్రేక్షకులకు మంచి రిలీఫ్‌నిచ్చే సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు బోర్‌ కొట్టించకుండా వీలైనంత ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించే ప్రయత్నం చేశారు దర్శకులు. అలాగే సిట్యుయేషన్‌కి తగ్గట్టు వచ్చే డైలాగ్స్‌ ఆడియన్స్‌ని నవ్విస్తాయి. ఫస్ట్‌ హాఫ్‌ అంతా ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా నడుస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి హీరోకి ఇచ్చిన టాస్క్‌ని పూర్తి చేసే క్రమంలో కొన్నిచోట్ల అనివార్యమైన సన్నివేశాలు కనిపిస్తాయి. ఫస్ట్‌హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ పాళ్లు తక్కువనే చెప్పాలి. సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే హాస్యాన్ని, పంచ్‌ డైలాగుల్ని ఆస్వాదించే వారికి సినిమా నచ్చుతుంది. ఇక సినిమా నిడివి విషయానికి వస్తే.. దాదాపు రెండున్నర గంటల సినిమా. ఇందులో అవలీలగా ఓ 20 నిమిషాలు తగ్గించవచ్చు. సెకండాఫ్‌లో ఒక పాటను హీరో, హీరోయిన్‌పై విదేశాల్లో చిత్రీకరించారు. వాస్తవానికి ఈ పాట సినిమాకు అవసరం లేదు. అలాగే సెకండాఫ్‌లో కొన్ని రిపీటెడ్‌ సీన్స్‌ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ తగ్గించి ఉంటే సినిమా ఇంకా గ్రిప్పింగ్‌గా ఉండేది. 

నటీనటులు: 

రెండో సినిమా చేయడానికి దాదాపు నాలుగు సంవత్సరాల సమయం తీసుకున్న ప్రదీప్‌.. ఒక మంచి సబ్జెక్ట్‌తోనే వచ్చాడు. కృష్ణగా తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు. కామెడీ చేయడంలో, కామెడీ డైలాగులు చెప్పడంలో కూడా టైమింగ్‌ మెయిన్‌టెయిన్‌ చేశాడు. అలాగే డాన్స్‌ విషయంలో కూడా కష్టపడినట్టు తెలుస్తుంది. ఇక సోషల్‌ మీడియా, కొన్ని షోల ద్వారా ప్రేక్షకులకు ఆల్రెడీ పరిచయం ఉన్న దీపిక పిల్లి ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమా అయినప్పటికీ ఆమె పెర్‌ఫార్మెన్స్‌కి, డాన్సులకు మంచి మార్కులు పడతాయి. సత్య, గెటప్‌ శ్రీను, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ తమ కామెడీతో అలరించారు. స్పెషల్‌ అప్పియరెన్స్‌గా కనిపించిన బ్రహ్మానందం ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశారు. 

సాంకేతిక నిపుణులు: 

ఈ సినిమా ద్వారా దర్శకులుగా పరిచయమైన నితిన్‌, భరత్‌.. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యడమే ప్రధానంగా ఈ కథను ఎంపిక చేసుకున్నారు. దానికి తగ్గట్టుగా స్క్రీన్‌ప్లే చేసుకున్నారు. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు డైలాగులకు ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇచ్చారు. రథన్‌ సంగీతం బాగుంది. అయితే రెండు పాటలు మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు. బాల్‌రెడ్డి ఫోటోగ్రఫీ ఆకట్టుకుంది. కొన్ని సీన్స్‌ని ఎంతో అందంగా చూపించడంలో సక్సెస్‌ అయ్యారు. ఎడిటింగ్‌ కూడా బాగుంది. అయితే సినిమాను మరికొంత ట్రిమ్‌ చేస్తే బాగుండేది. 

ఫైనల్‌గా చెప్పాలంటే..

మూస కథలు, అనవసరమైన యాక్షన్‌ సీక్వెన్స్‌, అక్కర్లేని భారీ సన్నివేశాలు, హీరో ఎలివేషన్లను మరపిస్తూ ప్రేక్షకులకు చక్కని వినోదం అందించే సినిమా ఇది. ఎక్కడా వల్గారిటీ అనేది లేకుండా, డబుల్‌ మీనింగ్‌ డైలాగులకు తావు ఇవ్వకుండా క్లీన్‌గా నడిచే సినిమా. వెతకడం మొదలు పెడితే క్లాసిక్‌ సినిమాల్లో కూడా తప్పులు కనిపిస్తాయి. అలా కాకుండా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేయదగ్గ సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’.

రేటింగ్ : 2.5/5



Source link