గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో పలు రకాల వివాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విష్ణు, మనోజ్ మధ్య, అలాగే మనోజ్, మోహన్‌బాబు మధ్య అనేక వివాదాలు ఉండడంతో ఆమధ్య అవి తారాస్థాయికి చేరుకొని ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో పోలీస్ కమిషనర్.. విష్ణు, మనోజ్‌లను పిలిపించి ఇకపై ఇలాంటివి జరగడానికి వీల్లేదని వారి దగ్గర నుంచి హామీ తీసుకున్నారు. అయితే మరోసారి విష్ణు, మనోజ్‌ల వివాదం రాజుకుంది. తను లేని టైమ్‌లో ఇంటిపై దాడి చేశారని, కార్లు, కొన్ని వస్తువులు ఎత్తుకెళ్లారని ఆరోపించారు మనోజ్. దీనికి సంబంధించి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం మోహన్‌బాబును కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్ళే ప్రయత్నం చేయగా మనోజ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అతను వస్తున్నాడని ముందే తెలుసుకున్న పోలీసులు మోహన్‌బాబు ఇంటికి కిలోమీటర్ దూరంలోనే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ఇంటి ముందే బైఠాయించాడు.
అక్కడ జరిగిన పరిణామాల గురించి మనోజ్ మీడియాతో మాట్లాడుతూ ‘డిసెంబర్ 8న ఈ గొడవ మొదలైంది. మధ్యలో ఎన్నో జరిగాయి. కానీ, ఇప్పటివరకు ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేయలేదు. ఏప్రిల్ 2 మా పా బర్త్‌డేను ఇక్కడ చేసుకోవడం ఎందుకు జైపూర్ వెళ్లి అక్కడ చేసుకోవచ్చు అని వెళ్లాం. నేను లేని టైమ్ చూసుకొని మా ఇంట్లోకి చొరబడి నా పదేళ్ళ కారు, మా వైఫ్ కారును టోయింగ్ చేసుకుంటూ తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలేశారు. ఇంట్లో మా పిల్లల వస్తువులు, బంగారం ఉన్న పెట్టె పగలగొట్టారు. బంగారం ఏం చేశారో తెలీదు. అలాగే 30 కార్లలో వచ్చిన రౌడీ షీటర్లు గోడదూకి లోపలికి ప్రవేశించి మా సెక్యూరిటీ వాళ్ళను కొట్టి మూడిరటి వరకు బంధించి ఉంచారు. ఈ విషయం గురించి పోలీసులకు చెబితే ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇదంతా వద్దు ఏదైనా వెండితెరమీదే పోటీ పడదాం అనుకున్నాను. అందుకే విష్ణు చేస్తున్న కన్నప్పకు పోటీగా నేను చేసిన భైరవం రిలీజ్ చెయ్యాలనుకున్నాను. దాంతో వాళ్ళకు టెన్షన్ మొదలైంది. అది మనసులో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు. ఇంతవరకు మా కుటుంబం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నేను బయటి బేనర్‌లో సినిమా చేసి హిట్ కొడితే వెంటనే తీసుకొచ్చి 24 ఫ్రేమ్స్‌లో సినిమా చెయ్యమన్నారు. ఆడ వేషం వెయ్యమని చెప్పారు. కానీ, నేను రెడీగా లేను అని చెప్పినా విష్ణు కెరీర్ కోసం వెయ్యాలి తప్పదు అన్నారు. అన్న కోసం ఆడవేషం కూడా వేశాను. మా ఫ్యామిలీ కోసం ఎంతో చేశాను. కానీ, ఏరోజూ డబ్బు తీసుకోలేదు. నేను వాళ్ళను ఏమీ అడగలేదు. ఆస్తి కూడా వద్దు నాకు అని చెప్పాను. ఇన్ని చేస్తున్నా వీళ్ళ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. పోలీసులకు చెబితే ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు’ అన్నారు.