అమ్మాయిలు తప్పనిసరిగా చెయ్యాల్సిన పని! | Money Saving Tips For Women|Money Saving Tips|Work that girls must do|girls must do|women can excel in are psychology and nursing

posted on Jun 10, 2025 9:30AM



 

ఈ కాలంలో అమ్మాయిలు ఎంచక్కా చదువుకుంటున్నారు. చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఒక నిర్ణీత వయసు రాగానే పెళ్లి అనేది సాధారణ విషయం. అయితే పెళ్లికి ముందు పుట్టింట్లో నాన్న దగ్గర గారాలు పోయి, అమ్మ దగ్గర బుజ్జగింపులు చేసి, అవ్వతాతల దగ్గర డిమాండ్ చేసి ఇలా అందరి దగ్గరా హాయిగా డబ్బు తీసుకుని అవసరాలు తీర్చేసుకుంటారు. కానీ పెళ్లి అయ్యాక అసలు సీన్ అన్నట్టు ఎంత కట్టుకున్నవాడు అయినా భర్త దగ్గర చెయ్యి చాపలేరు కొంతమంది అమ్మాయిలు. ఒకవేళ స్వేచ్ఛగా అడిగి తీసుకున్నా ఒకసారి కాకపోతే ఒకసారి అయినా మొగుళ్ల దగ్గర, అత్త మామల  దగ్గర ఏదో ఒక సంఘటనలు జరుగుతుంటాయి. ఫలితంగా ఒకానొక గిల్టీ ఫీలింగ్, ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేవి ఎంతో మంది అమ్మాయిల జీవితాలలో ఉంటాయి. అయితే అలా కాకుండా అమ్మాయిలు ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అంటే దానికి పరిష్కారం అమ్మాయిలు తమకు తాము ఆర్థిక భరోసా ఇచ్చుకోవాలి.

విద్యార్హత, ఉద్యోగం!

ఇంజనీర్లు, సాఫ్ట్ వేర్ లు, బ్యాంకింగ్, పీజీ లు పిహెచ్డి లు ఇవి ఇవే పెద్ద ఉద్యోగాలని, వీటి ద్వారా ఆర్థిక భరోసా సాధ్యమని అనుకునేవాళ్ళు నిజంగా అమాయకులు అనుకోవాలి. 

పదవ తరగతి నుండి డిగ్రీ వరకు కనీస స్థాయి విద్య చదివిన వాళ్ళు చాలా మందే ఉన్నారు ఈ సమాజంలో. అయితే వాళ్ళందరూ ఈ పోటీ ప్రపంచంలో ఈ విద్యార్హత పెద్దది కాదులే అనుకోవడమే పెద్ద వైఫల్యం. పడవ తరగతి మొదలు డిగ్రీ వరకు ఎన్నో అవకాశాలు ఉంటూనే ఉంటాయి. చెయ్యాల్సిందల్లా ప్రయత్నమే. 

ప్రతి మనిషిలోనూ ఏదో ఒక విషయంలో ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని ఫాలో అవుతూ దాన్ని పదును పెట్టుకుంటూ అందులో నైపుణ్యం సంపాదిస్తే అందులోనే పైసలు సంపాదించొచ్చు.

ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పడం నుండి దగ్గరలోనే ఉన్న షాప్స్, ఆఫీస్ లు, షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షోరూమ్స్ వంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాంటి చోట్ల పని చేసేవాళ్ళు సరైన వ్యక్తిత్వం కలిగి ఉండరు, తప్పు దారిలో వెళ్తారు లాంటి పిచ్చి ఆలోచనల వల్ల అమ్మాయిలు ధైర్యం చేయడం లేదు. సరైన వాక్చాతుర్యం, ఉన్నంతలో శుభ్రంగా ఉండటం, కాసింత ఓపిక ఉంటే మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. ఏమీ చేయకుండా ఉండటం కంటే ఏదో ఒకటి అయినా చేయడం ఉత్తమం కదా!! ఈ ఉద్యోగాలలో వచ్చే సంపాదనలో కనీసం 40-50% డబ్బును అమ్మాయిలు జాగ్రత్త చేసుకోగలిగితే గొప్ప ఆర్థిక భరోసా ఉంటుంది. జీవితంలో ధైర్యం దానికదే వస్తుంది.

విభిన్న మార్గాలు!

చదువుతో సంబంధం లేని మార్గాలు కూడా బోలెడు ఉన్నాయి. మొబైల్, కెమెరా గురించి కాస్త అవగాహన పెంచుకుంటే వంటిట్లో వండర్స్ చేసే మహిళలు యూట్యూబ్ లో అదరగొట్టేస్తారు. కిచెన్ చానల్స్ ను స్టార్ట్ చేసి దిగ్విజయంగా నడుపుతూ లక్షలు సంపాదిస్తున్న మహిళలే నిదర్శనం మరి. వాళ్లలో ఉన్నది మనలో లేనిది ఏంటి అని క్వశ్చన్ చేసుకుంటే మనలో లేనిది అవగాహన మాత్రమే అనే విషయం ఒప్పుకుని తీరాలి. కొందరు కారణాలు వెతికి చూపిస్తారు. కానీ నిజానికి ఉన్నదాంట్లో విభిన్నంగా చూపించడంలో సహజమైన ప్రతిభ ఉంటుంది. 

పొదుపు భరోసా!

సంపాదించుకునే దాంట్లో 40-50% పొదుపు సాధ్యమా అనే అనుమానం అందరికీ వస్తుంది. కానీ ఆలోచిస్తే నిజమే సాధ్యమే అనే విషయాన్ని నమ్మాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో మగవాళ్ళు ఊరికే బలాదూర్ గా ఏమి ఉండరు. వారి సంపాదన వాళ్లకు వుంటుంది. ఇంకా చెప్పాలంటే పెళ్లి కాని అమ్మాయిలలో సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లో ఇవ్వమని ఫోర్స్ చేసేవాళ్ళు చాలా తక్కువే. చాలా దిగువ తరగతి కుటుంబాలలో కూడా ఈ పరిణామాలు తక్కువే ఉంటాయి. కాబట్టి కనీసం 20% అయినా పొదుపు వైపు మళ్లించడం మంచిది. ఒకవేళ అలా అవ్వదు అనే అనుమానం వస్తే సింపుల్ గా వచ్చే సాలరీ ని తగ్గించి చెబితే సరోపోతుంది. ఇది మోసం అని అనుకునే కంటే భవిష్యత్తు గురించి జాగ్రత్త అనుకోవడం మంచిది. పొదుపు చేస్తున్నట్టు చెప్పినా ఎప్పుడూ ఆ పొదుపు గురించి డిస్కస్ చేయడం చాలా మంది అలవాటు కాబట్టి ఆ పొదుపును కూడా కాసింత రహాస్యంగానే చేసుకోండి తప్పు లేదు. 

ప్రస్తుత కాలంలో కొందరు మగవాళ్ళు నాకు మంచి ఉద్యోగం ఉంది, అమ్మాయి బాగా చదువుకున్నా ఉద్యోగం చెయ్యక్కర్లేదు ఇంట్లోనే ఉంటే బెస్టు, ఇంటిని, పిల్లల్ని చూసుకుంటేనే నాకు ఇష్టం అంటూ ఉంటారు. నిజానికి పెళ్లి అయిన తరువాత కూడా పిల్లలు పుట్టిన తరువాతే చాలా ఆర్థిక భారాలు పెరుగుతాయి. 

అన్నిటినీ భర్త, అత్త మామలు ఇచ్చే డబ్బుతోనే మైంటైన్ చెయ్యలేరు హౌస్ వైఫ్స్. కాబట్టి పెళ్లికి ముందు ఆర్థిక భరోసా, పెళ్లి తరువాత విభిన్న మార్గాల సంపాదన ఎంతో ముఖ్యం. 

                                ◆వెంకటేష్ పువ్వాడ.



Source link