ఒకప్పుడు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న సాధనం సినిమా ఒక్కటే. కాలం మారుతున్న కొద్దీ వారికి వినోదాన్ని అందించేందుకు వివిధ మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో సినిమా ప్రాధాన్యం సహజంగానే తగ్గింది. పాతతరం హీరోలు ఒక సినిమా చెయ్యాలంటే వంద రకాలుగా ఆలోచించేవారు. ఎలాంటి కథ నచ్చుతుంది, థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుల్ని ఎలా మెప్పించాలి అనే అంశాల గురించి ఆలోచించేవారు. తాము చేసే సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలి తప్ప వారిని డిజప్పాయింట్ చేసేలా ఉండకూడదని కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. ఇదంతా 80వ దశకానికి ముందు మాట. ఆ తర్వాత ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు రావడం, కొత తరహా కథలను, యాక్షన్‌తో కూడిన సినిమాలను కోరుకోవడం మొదలైంది. దానికి తగ్గట్టుగానే హీరోలు కూడా తమని తాము మార్చుకొని యాక్షన్‌పై దృష్టి సారించారు. 80వ దశకం నుంచి ఈ యాక్షన్ సినిమాలు ఊపందుకున్నాయి. ఆ సమయంలో వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలు యాక్షన్‌తో, తమ డాన్సులతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేశారు. ఆ జోనర్‌లోనే సూపర్‌హిట్ సినిమాలు చేసి స్టార్ హీరోలుగా ఎదిగారు.
ఈ తరహా సినిమాల తీరు 2010 వరకు బాగానే సాగింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో యాక్షన్ పాళ్లు కాస్త పెంచడంతో మన సినిమాలు హింసాత్మక ధోరణిలోకి వెళ్లిపోయాయి. ఇటీవలి కాలంలో ఆ తరహా సినిమాలు లెక్కకు మించి వస్తున్నాయి. హీరోలు, దర్శకులు, నిర్మాతలు.. సినిమాలో బలమైన కథ, కథనాలు ఉండాలి, మంచి డైలాగ్స్ ఉండాలి అనేది ఆలోచించకుండా యాక్షన్ సీక్వెన్స్‌లు ఎలా ఉండాలి, మన హీరో ఎంత మందిని నరకాలి, ఎంత బీభత్సం సృష్టించాలి అనే దానిపైనే దృష్టి పెడుతున్నారు. ఒకప్పుడు యాక్షన్ సీక్వెన్స్‌లు అంటే అందరూ చూడదగ్గవిగానే ఉండేవి. సినిమాల్లో రక్తం కనిపించడం అనేది చాలా తక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడలా కాదు. ప్రతి సినిమా రక్తసిక్తంగా కనిపిస్తోంది. హీరో ఎంతమందిని నరికితే అంత గొప్ప అనే ఫీలింగ్ ఆయా హీరోలకే ఉంది. కానీ, ప్రేక్షకులు ఆ విధంగా ఆలోచించడం లేదనేది వాస్తవం. ఇలాంటి భయానక సినిమాల నడుమ మంచి సినిమాలు కూడా వస్తున్నాయి. వాటిని ప్రేక్షకులు కూడా ఆహ్వానిస్తున్నారు. ఇటీవలి కాలంలో మంచి కాన్సెప్ట్స్‌తో వచ్చిన ఎన్నో సినిమాలు ఘనవిజయం సాధించాయి.
స్టార్ హీరోలు మాత్రం ఆ తరహా సినిమాల జోలికి వెళ్ళకుండా మూసధోరణిలోనే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈమధ్యకాలంలో వచ్చిన అలాంటి సినిమాలు ఎన్ని విజయం సాధించాయి అని అడిగితే చెప్పడానికి సమాధానం ఉండదు. ఫ్యామిలీ హీరోలుగా పేరు తెచ్చుకున్న నటులు కూడా ఆ జోనర్‌లో సినిమాలు చేసేందుకే ఆసక్తి చూపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడు సినిమాలు రిలీజ్ అయితే కటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి సినిమాలను ఎంజాయ్ చేసేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లాలంటేనే వణికిపోయే పరిస్థితి ఉంది. కోట్లల్లో పారితోషికాలు తీసుకునే హీరోలతోనే సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించే బడా నిర్మాతలు.. అలాంటి సినిమాలు చేసి భారీగా నష్టపోయిన సందర్భాలు కోకొల్లలు. సినిమాలో కథ ముఖ్యం కాదని, హీరో చేసే విన్యాసాలు, హీరో చేసే హత్యలే ప్రధానమని ప్రేక్షకులు భావించడం లేదు. వారికి కావాల్సింది వినోదం. ఆరోగ్యకరమైన హాస్యాన్ని, సందర్భోచితంగా వచ్చే డైలాగులను ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అయితే ఈ విషయంలో హీరోల ధోరణి మారాలి. తమ అభిరుచికి తగిన సినిమాలు కాకుండా ప్రేక్షకులు కోరుకునే తరహా సినిమాలు చేస్తే అందరికీ ఆరోగ్యం.
గత కొన్ని నెలలుగా ప్రతి వారం పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ అవ్వడం, మొదటి రోజు మొదటి ఆటకే డిజాస్టర్ అనిపించుకోవడం మనం చూస్తున్నాం. అయినా హీరోల ఆలోచనా విధానంలో మార్పు రావడం లేదు. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు నిర్మించి, వేల థియేటర్లలో రిలీజ్ చేసేసి మొదటి వారమే డబ్బు దండుకోవాలని చూసే నిర్మాతలు ఇండస్ట్రీలో ఉన్నంత కాలం హీరోల ఆలోచనలో మార్పు రాదని ఇటీవలికాలంలో విడుదలైన సినిమాలను చూస్తే అర్థమవుతుంది. గతంలో తెలుగు సినిమా ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలాంటి దుస్థితికి దిగజారింది అనేది ప్రతి వారం రిలీజ్ అవుతున్న సినిమాలను చూస్తే అర్థమవుతుంది. అనవసరమైన డైలాగులతో, భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారు హీరోలు. ఈ దారుణాలు ఇంకెన్నాళ్లు చూడాలి అని ప్రేక్షకులు మొర పెట్టుకుంటున్నా.. వారి బాధను అర్థం చేసుకునే స్థితిలో స్టార్ హీరోలు, నిర్మాతలు లేరు. ఈ తరహా సినిమాల నుంచి ప్రేక్షకుల్ని కాపాడాలని, మంచి సినిమాలు అందించాలని కొందరు హీరోలు, దర్శకనిర్మాతలు ప్రయత్నం చేయడం అభినందించదగిన విషయమే. అయితే యాక్షన్ సినిమాలు చేస్తేనే తమ ఇమేజ్, స్టార్ డమ్ పెరుగుతుందని ఆలోచిస్తున్న హీరోలు ఇప్పటికైనా ఆ భ్రమ నుంచి బయటికి వచ్చి ఆరోగ్యకరమైన సినిమాలు చేస్తారని ఆశిద్దాం.