కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ | 14 days remand to kommineni srinivasarao| mangalagiri| court| guntur| jilla

posted on Jun 10, 2025 2:26PM



అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో మంగళగిరి కోర్టు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం ( జూన్ 9) హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు ఆయనను తొలుత  విజయవాడకు, ఆ తర్వాత గుంటూరు రూరల్ నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. మంగళవారం (జూన్ 10)  గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు  ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కొమ్మినేనిని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.  

రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీనియర్ జర్నలిస్టు  కొమ్మినేని శ్రీనివాసరావు, మరో జర్నలిస్టు కృష్ణంరాజుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో రాజధాని రైతులు, మహిళల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. జగన్ సొంత మీడియాలో కొమ్మినేని నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావు సమర్ధించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కొమ్మినేనిని అరెస్టు చేసిన పోలీసులు కృష్ణంరాజు కోసం గాలిస్తున్నారు. 



Source link