posted on Jun 10, 2025 12:27PM
ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం పడిపోయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. అందులోనూ గుంటూరులో ఈ వేగం మరింత ఎక్కువగా ఉంది. 2024 ఎన్నికలకు ముందు వరకూ గుంటూరు జిల్లాలో వైసీపీ అత్యంత బలమైన పార్టీగా ఉండేది. ఆ సమయంలో మనోహర్ నాయుడు కూటమి పార్టీలను, అందులోని నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేవారు. అప్పుడు గుంటూరు జిల్లాలోని వైసీపీ ముఖ్య నేతల జాబితాలో ఆయన పేరు కూడా ఉండేది. ముఖ్యంగా జనసేనపై అయితే ఆయన విమర్శల ధాటి చాలా తీవ్రంగా ఉండేది. మనోహర్ నాయుడు అప్పటి విపక్ష నేతలకు అల్టిమేటమ్‌లు ఇస్తూ తొడలు కూడా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో మనోహర్ నాయుడు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు.. జనసేన నేతలతో వ్యవహరించిన తీరు రాష్ట్రంలోనే ఓ సంచలనంగా మారింది.
ముఖ్యంగా జనసేనాని పవన్‌పై అయితే మనోహర్ నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. అదే ఆయనకు ప్లస్ అయింది. గుంటూరు మేయర్‌గా ఉన్న ఆయన్ని జగన్ చిలకలూరిపేట నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించారు. ఎన్నికల సమయంలో మనోహర్ నాయుడుకి వైసీపీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మనోహర్ నాయుడు పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి సీన్ మారిపోయింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో గుంటూరు రాజకీయాల్లో అత్యంత కీలకమైన మార్పులు జరిగాయి. చాలామంది వైసీపీని వీడి కూటమి పార్టీల వైపు అడుగులు వేశారు. గుంటూరు కార్పొరేటర్లు పలువురు తెలుగుదేశం, జనసేన కండువాలు కప్పుకున్నారు. ఈ దెబ్బతో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఉన్న కావటి మనోహర్ నాయుడు.. తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఎలాగైనా తనను ఇబ్బంది పెడతారనీ, వాళ్లు తనని తొలగించే ముందే.. తానే తప్పుకుంటే బెటర్ అని మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేశారు. అదే ఇప్పుడు వైసీపీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చింది.
మనోహర్ నాయుడు రాజీనామాకు ముందు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కి సంబంధించి వైసీపీ అధ్యక్షుడు జగన్ నేతలందరినీ తాడేపల్లి పిలిపించుకొని మాట్లాడారు. అయినా మనోహర్ నాయుడు కనీసం అధిష్టానానికి చెప్పకుండా తన రాజీనామాన్ని ప్రకటించారు. రాజీనామా నిర్ణయంతో వైసీపీ నేతలు అంతా ఒక్కసారిగా షాక్ అవ్వాల్సి వచ్చింది. మనోహర్ నాయుడు తన నిర్ణయాలన్ని ముందుగా పార్టీ పెద్దలకు వివరించి, వారి ఆదేశాల మేరకు రాజీనామా చేసి ఉంటే బాగుండేదని కొందరు నేతలు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇక గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుతో సైతం మనోహర్ నాయుడు అంటీ ముంటన్నట్లు వ్యవహరిస్తున్నారంట. మేయర్ పదవికి రాజీనామా తర్వాత గుంటూరు వెస్ట్ నియోజవర్గ వైసీపీ ఇన్చార్జిగా తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారంట. అయితే వెస్ట్ నియోజవర్గానికి ఇన్చార్జిగా అంబటి రాంబాబు తనకు తానే ప్రకటించుకోవటంతో మనోహర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట. అందుకే పార్టీ చేపట్టిన వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి సైతం మనోహర్ నాయుడు దూరంగా ఉండిపోయారు. ఆ క్రమంలో పార్టీ పెద్దలు ఆయన్ని సస్పెండ్ చేశారంట.
ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి మనోహర్ నాయుడి రాజకీయ భవిష్యత్ సందిగ్ధంలో పడ్డట్టే కనిపిస్తోంది. మనోహర్ నాయుడుని ప్రస్తుతం వైసీపీ నుంచి బయటకు పంపారు. ఆయన కూటమిలోని ఏ పార్టీలో చేరే పరిస్థితి లేదు. తెలుగుదేశం, జనసేన నేతలు ఎవరూ కూడా మనోహర్ నాయుడు ఎంట్రీని అంగీకరించే పరిస్థితి లేదు. దీంతో మనోహర్‌నాయుడు పొలిటికల్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లే అన్న టాక్ వినిపిస్తోంది.