posted on Apr 9, 2025 4:00PM
జగ్గానందస్వామి.. జగ్గుభాయ్.. పాలిటిక్స్‌కు టెంపరరీగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు కనిపిస్తున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. జగ్గారెడ్డి పేరు చెబితేనే ఫైర్ బ్రాండ్, మాస్ లీడర్ అని అందరూ అంటుంటారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డి ఈ సారి ఎన్నికల్లో ఓడిపోయారు. గెలిస్తే మాత్రం కచ్చితంగా మంత్రి పదవి ఆయనకి దక్కేదన్న టాక్ ఉంది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో సైతం సంగారెడ్డిలో గెలుపు మెట్లు ఎక్కిన జగ్గారెడ్డికి గత ఎన్నికల్లో అదృష్టం కలిసి రాలేదు.
పార్టీని, పార్టీ నేతలను ఎవరైనా విమర్శిస్తే తనదైన శైలిలో ప్రతి విమర్శలు చేసే జగ్గారెడ్డి కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారు. దాంతో ఇప్పుడు ఆయన సైలెన్స్ కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ లు పెట్టి మైకును మోత మోగించే జగ్గారెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారోనని ఆయన అనుచరులే చర్చించుకుంటున్నారట. అకస్మాత్తుగా రాజకీయాలకు జగ్గారెడ్డి ఎందుకు దూరం అయ్యారోనని ఆరా తీస్తే రకరకాల లెక్కలు వినిపిస్తున్నాయి
ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో ఆయన హైదరాబాద్ కి తిరుగు పయనం అయ్యారు. ఆ టూర్‌లోనే జగ్గారెడ్డిలో నిర్వేదం వచ్చి, కొత్త కొత్త అవతారాలు బయటపడుతున్నాయంట. ఇన్ని రోజులు ఓ పొలిటికల్ లీడర్‌గా ఉన్న జగ్గారెడ్డి ఒక్కసారిగా తనలో ఓ యాక్టర్‌ని రివీల్ చేస్తున్నారు. వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు.
ఢిల్లీ పర్యటన అనంతరం జగ్గారెడ్డి హైదరాబాద్‌ని పూర్తిగా వదిలేశారన్న ప్రచారం జరుగుతున్నది. తన నియోజకవర్గమైన సంగారెడ్డికే ఎక్కువగా టైం కేటాయిస్తున్నారట. అది కూడా రాజకీయాలు వదిలేసిన ఆయన సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ రాం మందిరంలో రామభజన చేస్తూ భక్తిలో మునిగి తేలుతున్నారట. ప్రస్తుతం పాలిటిక్స్‌ని పక్కన పెట్టి సంగారెడ్డిలో పండుగలు, భజనల్లో బిజీగా ఉన్నారంట. మహాశివరాత్రి రోజు సంగీత విభావరి పెట్టిన జగ్గారెడ్డి హొలీ వేడుకల్నీ అదే స్థాయిలో నిర్వహించారు. చిన్న, పెద్ద, మిత్రులు, అభిమానులతో కలిసి హోలీ ఆడారు. హొలీ అయ్యిందో లేదో మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు.
అది అయిపోగానే ఉగాది వేడుకలు, శ్రీ రామ నవమి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఇలా పండుగ ఏదైనా కేరాఫ్ జగ్గారెడ్డి అనే విధంగా హడావుడి చేస్తున్నారంట. ఇక ఇన్నాళ్లు ఆయన్ని ఫుల్ టైం పొలిటీషియన్ గా చూసిన జనాలు త్వరలో ఇక సినిమా థియేటర్లలోనూ క్యారెక్టర్ యాక్టర్‌గా చూడనున్నారు. జగ్గారెడ్డి కాస్తా భక్తిలో జగ్గానంద స్వామిగా మారడం… సినిమాలో జగ్గూభాయ్‌లా ఎంట్రీ ఇస్తుండటంతో ఆయన అభిమానులు, అనుచరులు ఖుషీలో ఉన్నా కాస్త కన్ఫ్యూజ్‌లో పడ్డారట.
పాలిటిక్స్ అంటే ప్రాణం పెట్టే జగ్గారెడ్డిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందోనని అనుచర గణం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. కొందరేమో మార్పు మంచిదే అంటున్నారట. మరి కొందరు మార్పు వెనుక ఏదో మర్మం ఉందని ఎవరికి తోచినట్టు వారు విశ్లేషించుకుంటున్నారు. ఎప్పుడూ రాజకీయాల్లో తన మాటలతో తూటాలు పేల్చే జగ్గారెడ్డి.. మౌనంతోను రాజకీయాల్లో మంట పుట్టిస్తున్నారిప్పుడు. మరి రాజకీయాలు వదిలేసి రామ భజన చేస్తున్న జగ్గారెడ్డి మళ్ళీ పొలిటికల్‌గా ఎప్పుడు యాక్టివ్ అవుతారో చూడాలి.