posted on Apr 9, 2025 5:49PM
పిఠాపురం వేదికగా రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపుతు తిరుగుతున్నాయి. గత ఎన్నికలలో కూటమి ధర్మానికి కట్టుబడి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి మాటకు కట్టుబడి తన సీటును త్యాగం చేసి మరీ జనసేనాని పవన్ కల్యాణ్ విజయానికి కృషి చేసిన పిఠాపురం వర్మ ఆ తరువాత జరిగిన పరిణామాల పట్ల ఒకింత అసంతృప్తితో ఉన్నట్లు ఆయన అనుచరులే కాకుండా పిఠాపురం తెలుగుదేశం క్యాడర్ కూడా చెబుతోంది. పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సభలో నాగబాబు చేసిన కర్మ వ్యాఖ్యలతో నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన మధ్య గ్యాప్ ఏర్పడిందని పరిశీలకులు సైతం విశ్లేషించారు. ఆ తరువాత ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు రెండు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పిఠాపురం వర్మకు ఆహ్వానం అందలేదు. అయితే నాగబాబు పర్యటన ఆద్యంతం తెలుగుదేశం క్యాడర్ వర్మ అనుకూల నినాదాలు చేశారు. వాస్తవానికి పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు అప్పట్లో ఇచ్చిన మేరకు ఎమ్మెల్సీ పదవి ఇప్పటి వరకు దక్కలేదు. నాగబాబు జనసేన సభలో వర్మను ఉద్దేశించి చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య గ్యాప్ ను పెంచాయి. నాగబాబు పర్యటన వేళ వర్మ మద్దత దారులు, తెలుగుదేశం క్యాడర్ నిరసనలు చేశారు. వర్మను ఆహ్వానించకుండా నాగబాబు కార్యక్రమాల్లో పాల్గొనటం పై ఆందోళన వ్యక్తం చేసారు. నాగబాబు చేసిన వ్యాఖ్యల తరువాత పిఠాపురంలో రెండు పార్టీల కేడర్ మధ్య అంతర్గతంగా రచ్చ సాగుతున్నా, ఇప్పటి వరకూ ఇటు తెలుగుదేశం అధినాయకత్వం కానీ, అటు జనసేనాని కానీ స్పందించలేదు.
ఈ నేపథ్యంలో పిఠాపురం వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంతకీ ఆయన అన్నదేమిటంటే.. తెలుగుదేశం పార్టీ పగ్గాలను నారా లోకేష్ చేపట్టాలని. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వర్మ వైఖరి ఏమిటన్న చర్చకు తెరతీశాయి. అదలా ఉంచితే.. గతంలో కూడా పిఠాపురం వర్మ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు తాజాగా పార్టీ పగ్గాలు అప్పగించాలన్నారు.
కాకినాడ జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ లో బుధవారం (ఏప్రిల్ 9) మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ నాయకత్వం అవసరమన్నారు. యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో ఆయన నూతనోత్సాహాన్ని నింపారనీ, అంతే కాకుండా అప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలలో పెద్దగా పాలుపంచుకోని సీనియర్లంతా అనివార్యంగా బయటకు వచ్చి ప్రజలలో మమేకం అయ్యేలా చేశారనీ అన్నారు. విజన్ 2047తో పాటుగా పార్టీ భవిష్యత్ కోసం కూడా 2047 ప్రణాళికను రూపొందించాలని పిఠాపురం వర్మ అన్నారు.