అజిత్ కొత్త సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ గురువారం థియేటర్లలోకి వచ్చింది. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఈ సినిమా కంటే ముందు వచ్చిన విదాముయర్చి సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనేది ఫుల్ మాస్ సినిమా కాబట్టి తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని అభిమానులు ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. అందుకే ఎంతో ఉత్సాహంగా థియేటర్ల దగ్గర హడావిడి చేస్తున్నారు. అంతేకాదు, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్ల దగ్గర పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకొని ఆడియన్స్‌కి హాల్స్, విక్స్ ప్యాకెట్లు అందిస్తున్నారు. అయితే ఈ చర్య చూసి అక్కడ ఉన్న వారంతా ఎంతో ఆశ్చర్యపోయారు. హాల్స్, విక్స్ పంచడం ఏమిటి అనేది వారికి అర్థం కాలేదు.
విషయం ఏమిటంటే.. విదాముయర్చి సినిమాలో మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్లే తమ హీరోకి విజయ దక్కలేదని, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో అవన్నీ పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తోందని అభిమానులు భావిస్తున్నారు. మరి మాస్ సినిమా అంటే థియేటర్‌లో సందడి మామూలుగా ఉండదు కదా. తమ అభిమాన హీరో అజిత్ స్క్రీన్‌పై కనిపించగానే థియేటర్ అంతా కేకలతో, విజిల్స్‌తో దద్దరిల్లిపోతుంది. ఒకరోజు ముందే విదేశాల్లో సినిమా రిలీజ్ అవ్వడం, సినిమా చాలా పెద్ద హిట్ అనే టాక్ రావడంతో అజిత్‌కి ఇది కమ్ బ్యాక్ మూవీ కాబోతోందని ఎంతో ఉత్సాహంగా చెబుతున్నారు. అందుకే ఇక్కడ థియేటర్ల దగ్గర హడావిడి చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. సినిమాకి వచ్చే ప్రేక్షకులకు హాల్స్, విక్స్ ఎందుకు ఇస్తున్నారంటే.. ఇలాంటి మాస్ సినిమాకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అజిత్ కనిపించిన ప్రతిసారీ కేకలు పెట్టాలి, విజిల్స్ వేయాలి. అసలే ఎండా కాలం.. అరిచి అరిచి గొంతు ఎండిపోకూడదని ముందు జాగ్రత్తగా హాల్స్, విక్స్ పంచుతున్నామని చెబుతున్నారు అభిమానులు. చెన్నయ్‌లోని చాలా థియేటర్లలో ప్రేక్షకుల కోసం అభిమానులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.