posted on Apr 21, 2025 5:34PM
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి జనసేన గూటికి చేరారు. ఆయన చేరిక అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఆయన జనసేన చేరికను తెలుగుదేశం గట్టిగా వ్యతిరేకించింది. బాలినేని చేరిక సందర్కభంగా ఒంగోలులో పలు చోట్ల ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు ధ్వంసం చేశారు. ఇక అటు జనసేనలో కూడా అప్పట్లో ఆయన చేరిక పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది.
వైసీపీ అధినేత జగన్ కు బంధువు కావడం, ఆయన చేరికతో వైసీపీ నుంచి పలువురు ఆయన అనుచరులు కూడా వచ్చి చేరే అవకాశాలు ఉండటంతోనే అప్పట్లో బాలినేనిని తెలుగుదేశం, జన సేనలు వ్యతిరేకించాయి. అయితే.. పవన్ కల్యాణ్ మాత్రం బాలినేనిని మాత్రమే చేర్చుకుంటున్నట్లు క్లారిటీ ఇవ్వడమే కాకుండా బాలినేని కోరినట్ల ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి మందీ మార్బలంతో పార్టీ తీర్ధం పుచ్చుకోవాలని భావించిన బాలినేనికి చెక్ పెట్టారు. ఒంగోలులో కాదు.. ఒక్కరుగా మంగళగిరి వచ్చి పార్టీ కండువా కప్పుకోండని తేల్చి చెప్పారు. దాంతో బాలినేని అప్పట్లో ఒక్కడుగానే మంగళగిరి వెళ్లి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటి నుంచీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో తన అనుచరులందరినీ జనసేన గూటికి చేర్చాలన్న ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయన ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేశారు. వైసీపీలో అసంతృప్త నేతలపై ఫోకస్ చేస్తున్న బాలినేని.. ఉమ్మడి ఒంగోలు జిల్లాలో జనసేన బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.
వైసీపీలోని ఓ కీలక నేతతో బాలినేని మంతనాలు సాగిస్తున్నారనీ, త్వరలో ఆ కీలక నేత జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయనీ అంటున్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతోపాటు పార్టీకి భవిష్యత్తు లేదన్న అంచనాతో కందుకూరు మాజీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని గట్టిగా వినిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారవుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా వైదొలగుతుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోందని అంటున్నారు. ప్రధానంగా వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలు.. అక్కడ తమ ప్రాబల్యం పెంచుకునేందుకు తమ అనుచరులను వైసీపీకి రాజీనామా చేసి రమ్మంటూ ప్రోత్సహిస్తున్నారు. గతంలో వైసీపీలో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రి బాలినేని ఈ కోవలో అందరికంటే ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనలో చేరినప్పుడే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీని ఖాళీ చేస్తానని ఆయన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఆ దిశగా అడుగులేస్తూ కందుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డిని జనసేనలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన మహీధర్ రెడ్డి సీనియర్ నేత. 1989లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2014 వరకు కాంగ్రెస్ లో కొనసాగారు. 2014లో వైసీపీలో చేరిన ఆయన కందుకూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో పోటీకి దూరంగా ఉండిపోయారు. 2009 నుంచి 2014 వరకు రాష్ట్రమంత్రిగా పనిచేసిన మహీధర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి కూడా శాసనసభ్యుడిగా సేవలందించారు. తొలి నుంచి టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న మహీధర్ రెడ్డి ఈ కారణంగా గత ఎన్నికల ముందు తెలుగుదేశం నుంచి ఆహ్వానం వచ్చినా వెళ్లలేదని చెబుతున్నారు. వైసీపీ టికెట్ నిరాకరించినా, అందుకే ఆ పార్టీని వీడకుండా కొనసాగుతున్నారు. అయితే పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న మహీధర్ రెడ్డి అధినేత జగన్ వైఖరి మారుతుందని ఇన్నాళ్లు వెయిట్ చేశారని అంటున్నారు.
కానీ పార్టీ ఓడినా అధిష్టానం వైఖరి మారకపోవడంతో ఇప్పుడు ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తు న్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకలాపాలు పుంజుకోవడం, భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తుందన్న అంచనాకు తోడు బాలినేని ప్రోత్సాహంతో మహీధర్ రెడ్డి జనసేనపై మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. ఆయన చేరికకు జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. వివాద రహితుడు, సీనియర్ నేత, రాజకీయ కుటుంబ నేపథ్యం వల్ల మహీధర్ రెడ్డి చేరికను ఇతర భాగస్వామ్యపక్షాలు వ్యతిరేకించే పరిస్థితి లేదనీ, త్వరలోనే మహీధర్ రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.