ఎన్నడూ లేని విధంగా గత ఏడాది నుంచి సినీ పరిశ్రమలో రకరకాల వివాదాలు తలెత్తుతున్నాయి. వాటిలో మంచు ఫ్యామిలీ వివాదం కోర్టుకెక్కడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించడంతోపాటు ఒకింత ఆసక్తిని కూడా రేకెత్తిస్తోంది. జల్‌పల్లిలోని ఇంటికి సంబంధించి కోర్టులో వివాదం నడుస్తున్న నేపథ్యంలో తాజాగా ఎల్.బి.నగర్ కోర్టు మోహన్‌బాబు పెట్టుకున్న పిటిషన్‌ని కొట్టి వేసింది. అంతేకాదు, అక్కడ పనిచేస్తున్న కోర్టు క్లర్క్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ అతనికి మెమో జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనంతటికీ కారణం మనోజ్ ప్రవేశ పెట్టిన కీలక ఆధారాలే అని తెలుస్తోంది. మోహన్‌బాబుకి కోర్టు షాక్ ఇవ్వడంతో మనోజ్‌కి ఊరట లభించింది. తన ఇంటిలోకి మనోజ్‌కి ప్రవేశం లేదని, ఆ విధంగా తీర్పునివ్వాల్సిందిగా గతంలో కోర్టులో పిటిషన్ వేశారు మోహన్‌బాబు. ఎల్.బి.నగర్ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. తాజాగా జరిగిన పరిణామాలు, మనోజ్ సమర్పించిన ఆధారాలతో మోహన్‌బాబు వేసిన పిటిషన్‌ను కోర్టు మరోసారి విచారణకు తీసుకుంది. అన్నీ పరిశీలించిన కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తన కుమార్తె పుట్టినరోజు నిమిత్తం ఇటీవల మనోజ్ కుటుంబం రాజస్థాన్ వెళ్లింది. అదే సమయంలో కొందరు వ్యక్తులు మనోజ్ ఇంటిపైనా, ఆఫీస్‌పైనా దాడి చేసి కొన్ని వస్తువులు, కార్లు దొంగిలించుకొని వెళ్లారని ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టులో ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. తన ఇంటిపై దాడి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలన్న ప్రయత్నాన్ని కూడా విష్ణు అడ్డుకున్నాడని మనోజ్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు, తన కేసు విషయంలో నకిలీ పత్రాలు సృష్టించి కోర్టును మోసం చేసి తప్పుదోవ పట్టిస్తున్నారని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని బుధవారం జల్‌పల్లి ఇంటి దగ్గర మీడియాతో చెప్పారు. దానికి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టారు మనోజ్. తన తండ్రి తరఫు న్యాయవాదులు కూడా కోర్టును మోసం చేస్తున్నారన్నారు. మొత్తానికి మనోజ్ తన తండ్రి మోహన్‌బాబుకు కోర్టు ద్వారా షాక్ ఇచ్చారు. అయితే కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మోహన్‌బాబు తరఫు న్యాయవాదులు హైకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో ఏం జరిగినా దాన్ని ఎదుర్కోవడానికి మనోజ్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అతని దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మరి మంచు ఫ్యామిలీ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందీ, అసలు దీనికి క్లైమాక్స్ ఉందా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.