posted on Jun 16, 2025 11:09AM
ముడి చమురు దిగుమతులకు భారత్ ఇక వెంపర్లాడాల్సిన పని లేదు. ఇప్పటికైనా ప్రపంచంలో ముడి చమురు విషయంలో అమెరికా, చైనాల తరువాత మూడో స్థానంలో ఉన్న భారత్ అతి త్వరలో ముడి చమురును ఎగుమతి చేసే స్థాయికి ఎదగనుంది. అండమాన్ సముద్రంలో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయనీ, వాటిని కనుగొని వెలికి తీసేందుకు భారత్ సమాయత్తమౌతోంది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియయం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ఒక ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ సంగతి తెలిపారు.
అండమాన్ సముద్రంలో ఉన్న భారీ చమురు నిల్వల ముందు గయానాలోని చమురు నిల్వలు తక్కువేనని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత్ రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా వంటి దేశాల నుండి పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అండమాన్ సముద్రంలో భారీగా ఉన్న చమురు నిల్వలను వెలికి తీస్తే భారత్ దశ మారిపోతుంది. ముడి చమురును దిగుమతి చేసుకునే స్థితి నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి చేసే స్థాయికి చేరుతుంది. అంతే కాదు 3.7 ట్రిలియన్ నుంచి మన $20 ట్రిలియన్ లకు మన ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని కేంద్ర మంత్రి చెప్పారు.