IPL 2025 RCB vs MI: వాంఖడేలో ఆర్సీబీ తుపాన్.. దంచికొట్టిన రజత్, కోహ్లి, జితేశ్.. ముంబయికి భారీ టార్గెట్
IPL 2025 RCB vs MI: గత మ్యాచ్ లో హోం గ్రౌండ్ లో షాకింగ్ ఓటమి ఎదుర్కొన్న ఆర్సీబీ తిరిగి పుంజుకుంది. సోమవారం వాంఖడేలో ముంబయి ఇండియన్స్ పై ఆర్సీబీ బ్యాటర్లు చెలరేగారు. కెప్టెన్ రజత్ పటీదార్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, జితేశ్ రెచ్చిపోవడంతో ఆ టీమ్ భారీ స్కోరు సాధించింది.
ఏమా బ్యాటింగ్.. ఏమా బాదుడు. వాంఖడే స్టేడియంలో ఆర్సీబీ పరుగుల తుపాన్ సృష్టించింది. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 67; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రజత్ పటీదార్ (32 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జితేశ్ శర్మ (19 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ తో ముంబయి ఇండియన్స్ ను హడలెత్తించారు.
సోమవారం (ఏప్రిల్ 7) వాంఖడేలో ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేసింది. ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న బుమ్రా 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చాడు. వికెట్ తీయలేకపోయాడు.
విరాట్ మాస్
ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో టాస్ ఓడిన ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది. కానీ ఫస్ట్ ఓవర్లోనే మరోసారి బౌల్ట్ వికెట్ సాధించాడు. ఫిల్ సాల్ట్ (4)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కానీ ఆ ఎఫెక్ట్ టీమ్ మీద పడలేదంటే కారణం కోహ్లి. ఈ స్టార్ బ్యాటర్ మాస్ ఆటతీరుతో అదరగొట్టాడు. వాంఖడేను ఉర్రూతలూగించాడు. మరో ఎండ్ లో దేవ్ దత్ పడిక్కల్ (22 బాల్స్ లో 37) కూడా కోహ్లికి కాసేపు సపోర్ట్ చేశాడు.
బౌండరీల జోరు
కోహ్లి, దేవ్ దత్ కలిసి ముంబయి బౌలర్లను ఆటాడుకున్నారు. బౌల్ట్ ఓవర్లో దేవ్ దత్ సిక్సర్ దంచగా.. కోహ్లి వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. గాయం నుంచి కోలుకుని వచ్చి ఈ ఐపీఎల్ 2025లో ఫస్ట్ ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్ లో కోహ్లి తన ట్రేడ్ మార్క్ సిక్సర్ కొట్టాడు. దీపక్ చాహర్ బౌలింగ్ లో దేవ్ దత్ వరుసగా 6, 6, 4 కొట్టడంతో పవర్ ప్లేలో ఆర్సీబీ 73/1తో నిలిచింది.
రిస్ట్ స్పిన్నర్ విఘ్నేశ్ బౌలింగ్ లో సిక్సర్ తో కోహ్లి 29 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. కానీ అదే ఓవర్లో పడిక్కల్ పెవిలియన్ చేరాడు. ఆ దశలో హార్దిక్, శాంట్నర్, బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ స్కోరుకు కాస్త బ్రేక్ పడింది. 17 బంతుల్లో ఒక్క బౌండరీ రాలేదు.
హార్డిక్ బ్రేక్
స్లోగా తన ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ స్పీడ్ పెంచడంతో మళ్లీ ఇన్నింగ్స్ వేగాన్ని అందుకుంది. శాంట్నర్ బౌలింగ్ లో రజత్ రెండు సిక్సర్లు బాదాడు. 14 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 143/2. కానీ తర్వాతి ఓవర్లో కోహ్లి, లివింగ్ స్టన్ (0) వికెట్లతో హార్దిక్ పాండ్య.. ఆర్సీబీ కి బ్రేక్ వేశాడు. 42 బాల్స్ ఆడిన కోహ్లి 67 రన్స్ కొట్టాడు. 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.
రెచ్చిపోయిన కెప్టెన్
టపటపా రెండు వికెట్లు పడ్డా రజత్ మాత్రం ఆగలేదు. మరింతగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా హార్దిక్ వేసిన 17వ ఓవర్లో విధ్వంసం నమోదు చేశాడు. రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. ఆ ఓవర్లో 23 రన్స్ వచ్చాయి. 25 బాల్స్ లోనే రజత్ ఫిఫ్టీ చేరుకున్నాడు.
మరో ఎండ్ లో యంగ్ వికెట్ కీపర్ జితేశ్ శర్మ అమేజింగ్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. బౌల్ట్ బౌలింగ్ లో వికెట్లకు అడ్డంగా జరిగి డీప్ మిడ్ వికెట్, ఫైన్ లెగ్ మీదుగా జితేశ్ కొట్టిన సిక్సర్లకు వావ్ అనాల్సిందే. అదే ఓవర్లో రికిల్టన్ పట్టిన సూపర్ క్యాచ్ కు రజత్ ఔటయ్యాడు. 32 బాల్స్ లో 64 రన్స్ చేసిన రజత్ 5 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు.
లాస్ట్ ఓవర్ ను బుమ్రా గొప్పగానే వేశాడు. నాలుగు బంతుల్లో రెండు పరుగులే ఇచ్చాడు. కానీ అయిదో బాల్ కు క్రీజులో డీప్ గా వెళ్లి జితేశ్ కొట్టిన సిక్సర్ తో టీమ్ స్కోరు 220 దాటింది. ముంబయి బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ చెరో రెండు వికెట్లు తీశారు.
సంబంధిత కథనం